మిషన్‌ 19… మిషన్‌ 99

మిషన్‌ 19/99 అన్నది రేవంత్‌రెడ్డి ప్రజాపోరాట లక్ష్యం. ఐదు దశాబ్దాల సుదీర్ఘపోరాటం ఫలితంగా తెలంగాణను సాధించుకున్నా దాని ఫలితాన్ని మాత్రం ఒకే కుటుంబం అనుభవించడాన్ని రేవంత్‌ వ్యతిరేకిస్తారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం ఏకఛత్రాధిపత్యంలో ఏలాలని చూస్తోంది. అదే జరిగితే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది.. ఒకప్పుడు గడీలలో కొనసాగిన దొరల పాలన మళ్లీ మొదలవుతుంది.. కానీ నేను అలా జరగనివ్వను, ఎంతవరకైనా పోరాడుతూను..” అన్నది రేవంత్‌ విధానం. తన పోరాటం సఫలీకృతం కావడానికి సుదీర్ఘ పోరాటంతో పాటుగా ప్రజాచైతన్యం కూడా కావాలనే విషయంలో రేవంత్‌కు స్పష్టత ఉంది. తన రాజకీయ విరోధి కేసీఆర్‌ ఆయన అనుచరులు తెలుగుదేశం అంటే కేవలం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్టీ అనే విషప్రచారాన్ని ప్రజల్లో బలంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడం ఎవరు నిజమైన తెలంగాణా అభివృద్ధిని కోరుకొనేవారో ప్రజలే అర్థం చేసుకోవాలన్నది ఆయన ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే కొంతవరకు ఆయన జనంలోకి బలంగా వెళ్లడంలో సఫలీకృతులయ్యారు. ఒకప్పుడు తమ క్యాంపస్‌లోకి అడుగుపెడితే సహించేది లేదని తీవ్ర పదజాలంతో నిందించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్‌లో జరిగిన తెలంగాణా జనజాతరకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించి భారీ పోలీసు బలగాలతో అడ్డుకోవాలని ప్రయత్నించినా రేవంత్‌ నిర్భయంగా ఓయూ క్యాంపస్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఒకప్పుడు ఆయనను తీవ్రంగా వ్యతిరేకించిన ఆ విద్యార్థులే రేవంత్‌ను భుజాలపై మోస్తూ సభా వేదిక వద్దకు తీసుకెళ్లారు. తెలంగాణ విద్యార్థుల్లో వచ్చిన మార్పుకు ఈ సంఘటన నిన్నటి ఉదాహరణ. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు మద్దతుగా ఆ నియోజకవర్గంలోని ఏటిగడ్డ లక్ష్మాపూర్‌లో రెండు రోజులు దీక్ష చేసినప్పుడు కేసీఆర్‌ ఇలాఖాలో జనం రేవంత్‌కు బ్రహ్మరథం పడుతూ జేజేలు పలకడం ఇప్పటి తాజా ఉదాహరణ. రేవంత్‌ మాత్రం తన లక్ష్యసాధన కోసం నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఏటిగడ్డ లక్ష్మాపూర్‌లో రెండు రోజులు నిర్వహించిన దీక్షతో రేవంత్‌ ప్రతిష్ట ఇనుమడించింది. పైగా ఈ దీక్ష ప్రారంభించిన రోజునే కేసీఆర్‌ దిగి వచ్చి రైతులు ఎలా కోరుకుంటే అలాగే పరిహాలం చెల్లిస్తామంటూ అధికారికంగా ప్రకటించడం రేవంత్‌కు ఉన్న ప్రజాదరణ ప్రభావం ఎలాంటిదో స్పష్టం చేసింది. ”ఒక్క మల్లన్నసాగరే కాదు ఇంకా ఎన్నో సమస్యలున్నాయి. అంతకు మించి జీవన విధ్వంసాలు ఉన్నాయి. వాటినన్నిటినీ అధ్యయనం చేయాలి. అలాగే మేకవెన్న పులి కేసీఆర్‌ అసలు స్వరూపాన్ని జనం ముందు పెట్టాలి, నిరంతరం ప్రజల కోసం పోరాడాలి, తల తెగిపడినా వెనకుంజ వేయకూడదు” అన్నది రేవంత్‌ మనసులో మాట ”తెలంగాణ గుండె చప్పుడు” పేరుతో తన పోరాటాలను నిర్విరామంగా కొనసాగించాలన్నది ఆయన ఆశయం. ఇది కాకుండా తన లక్ష్యసాధనలో భాగంగా ‘అలంపూర్‌ నుంచి ఆదిలాబాద్‌ దాకా పాదయాత్ర” చేస్తానని కూడా గతంలోనే రేవంత్‌ ప్రకటించారు. అలంపూర్‌లోని జోగుళాంబ ఆలయం నుంచి మొదలుకొని ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం నిర్వహించే ఈ పాదయాత్ర ద్వారా తెలంగాణలోని ప్రతి పల్లె గడప తొక్కాలని, ప్రతి ఇంటి తలుపు తట్టాలని జనం సమస్యలను తెలుసుకొని వారికి నేనున్నానంటూ భరోసా ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు.