విజన్‌

ఏ విషయానైనా రేవంత్‌ చూసే దృష్టికోణం విభిన్నంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం విషయంలోనూ ఆయనకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధిని గురించి, చదువులు, కొలువులను గురించి, వ్యవసాయ, పారిశ్రామిక విధానాలను గురించి స్పష్టమైన లక్ష్యాలున్నాయి.

గ్రామీణాభివృద్ధి :

స్వాతంత్య్రం వచ్చి అరవై ఏళ్లు గడిచిపోయాయి. పంచవర్ష ప్రణాళికలెన్నో ముగిసిపోయాయి. కానీ ఈ నాటికీ గ్రామ ప్రాంతాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. ఏ గ్రామానికి మనం వెళ్లినా ముందుగా మనల్ని పలకరించేది చెత్తకుప్పలు, మురికి గుంటలు, ఎగుడుదిగుడు రోడ్లు వాటితోపాటుగా బడిలోకి వెళ్లకుండా బర్రెలు కాసుకొనే పిల్లలు, పనీపాటా లేకుండా ఖాళీగా కనిపించే పోరగాండ్లు. అత్యధిక గ్రామాల్లో కనీసం పంచాయితీ కార్యాలయాలు కూడా ఉండవు. సుస్తీ చేస్తే చూపించుకొనీకి ఒక దవాఖానా కూడా ఉండదు. అత్యవసరంగా ఆస్పత్రికి పట్నం పోవాలంటేమో బస్సులుండవు, బస్సులుంటేనేమో జేబులోన డబ్బులుండవు. తాగనీకి నీళ్లుండవు. బోర్లు ఎండిపోయింటాయి. వీధి దీపాల్లో లైట్లు మాడిపోయింటాయి. స్కూళుంటాయిగానీ వాటికి సరైన బిల్డింగులు ఉండవు, బిల్డింగులు ఉంటే చదువులు చెప్పనీకి టీచర్లుండరు. వ్యవసాయం చేయడానికి నీళ్లుండవు, ఒకవేళ నీళ్లుంటే వాటిని తోడుకొని వాడుకోవడానికి అవసరమైన కరెంటు ఉండదు. వేయడానికి విత్తనాలుండవు,సమయానికి రైతుల దగ్గర పెట్టుబడి పెట్టడానికి పైసలు కూడా ఉండవు. బ్యాంకుల వద్దకు పోతే బాకీ ఇవ్వరు, ప్రైవేటోళ్ల దగ్గర పైసలు తీసుకుంటే గింజలు కూడా మిగలవు. ఈ విధంగా గ్రామాల్లో ప్రజల బతుకుల ఆగమాగంగానే ఉంటాయి. గిరిజన తండాలు, దళితులు, వెనుకబడినవర్గాలు ఎక్కువగా ఉండే హరిజనవాడలు, కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలకు చేరువగా ఉండే గ్రామాలలో ఈనాటికీ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వీటికి భిన్నంగా కొన్ని సిమెంటు రోడ్లు, రంగుల భవనాలు ఉన్న ఒకటి రెండు గ్రామాలు ఎక్కడైనా ఉంటాయి. వీటిని చూపించి మొత్తం గ్రామాలన్నీ ఇలాగే అభివృద్ధి చెందాయనుకోవడం సరైన విధానం కాదన్నది రేవంత్‌ అభిప్రాయం. ప్రధాన రహదారుల్లో ఉన్న కారణంగానో, ప్రాధాన్యత కలిగిన వ్యక్తులు ప్రాతినిధ్యం వహిస్తున్న కారణంగానో అభివృద్ధి చెందిన గ్రామాలకే అన్నీ లభిస్తుండగా వెనకబడిన గ్రామాలు తరతరాలుగా సమస్యలతో సమతమమౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే అభివృద్ధి పనుల మంజూరులోనూ కొన్ని ప్రాధాన్యతలను పాటించడం ద్వారా ఏ గ్రామంలో మౌలిక సదుపాయాల లేమి ఎక్కువగా ఉందో గుర్తించి ఆ విధంగా ఎక్కువగా సమస్యలున్న గ్రామాలకు అభివృద్ధి చెందే అవకాశం ఇవ్వాలన్నదే ఆయన ఆలోచన. రాష్ట్ర బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రతియేటా రూపొందించి దాని ప్రకారంగా నిధులను కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ కాంపొనెట్‌ కింద వచ్చే నిధులను దారి మళ్లించడం ద్వారా గణణీయమైన అభివృద్ధిని సాధించవచ్చునన్నది ఆయన అభిప్రాయం. అంగన్‌వాడీలు, పాఠశాలల్లో పని చేసే టీచర్లు, దవాఖానకు సంబంధించిన డాక్టర్లు, ఎఎన్‌ఎంలు, రేషన్‌ డీలర్లు తదితరులందరి పని తీరును పర్యవేక్షించే బాధ్యత గ్రామ కమిటీలకు ఇవ్వాలన్నది రేవంత్‌ ఆలోచన. ఈ విధమైన ప్రజల భాగస్వామ్యంతో జవాబుదారీతనం పెరుగుతుందని ఆయన భావన. ”ప్రతి గ్రామానికి రోడ్డుండాలి.. ఒక బస్సు ఉండాలి… స్కూలు ఉండాలి, అందులో టీచర్లుండాలి.. అంగన్‌ వాడీలో పోషకాహారం, రేషన్‌షాపులల్లో సరుకులు సక్రమంగా పంపిణీ జరగాలి.. కనీసం రెండు రోజులకోసారైనా గ్రామాల్లో ముసలీ, ముతకు మందిచ్చే దవాఖాన ఉండాలి.. అదనులో అన్నదాతలకు అన్నీ ఇచ్చి అండగా నిలిచే సహకార వ్యవస్థ రావాలి.. పనిలేని వాళ్లంటూ గ్రామాల్లో ఉండకూడదు.. ప్రతి పేద కుటుంబానికి ఉండటానికి ఇల్లు, చేయడానికి పని, తింటానికి తిండి ఉండాలి.. గ్రామాల్లో బీడు భూములన్నీ పేదలకు పంపాలి.. తద్వారా గ్రామాల్లో ప్రతి అంగుళం భూమి పచ్చగా ఉండేలా చూడాలి.. ” ఇదీ రేవంత్‌ మనసులో మాట. గ్రామాలన్నీ అభివృద్ధి చెందితే రాష్ట్రం కూడా దానంతట అదే పురోగమిస్తుందన్నది ఆయన అభిప్రాయం.

నిర్భంధ విద్యావిధానం :

ఒకవైపు గ్రామాలకు అభివృద్ధి చేస్తూనే మరోవైపు ప్రతిఒక్కరూ చదువుకోవాలనే నిర్భంధ విద్యావిధానాన్ని తీసుకురావాలని, ఏదో ఒక స్థాయి నుంచి ఏ పథకంలోనైనా లబ్ధికి చదువును ప్రాతిపదికగా చేయాలన్నది రేవంత్‌ మరో విధానం. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న నిరక్షరాస్యతను ఆసరాగా తీసుకొని ఇప్పటికీ దొరలు రాజ్యమేలుతుంటే, మరోవైపు మూఢనమ్మకాల ఎర చూపించి మోసగాళ్లు వారిని దోచుకుంటున్నారన్నది రేవంత్‌ ఆవేదన. అక్షరాలు నేర్వని కారణంగానే జరుగుతున్న మోసాలను అరికట్టలేక, జనం హితం కోసం ఉన్న చట్టాలను గురించి తెలుసుకోలేక మౌనం వహిస్తున్న కారణంగానే గ్రామీణ ప్రాంతాలు మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోలేకపోతున్నా యన్నది ఆయన అభిప్రాయం. అందుకే ఆడా, మగా తేడా లేకుండా ప్రతిఒక్కరూ చదువుకోవాలన్నది ఆయన ఆశయం. అయితే విద్యను నిర్భంధం చేసినప్పుడు చదువుకొనే అవకాశం అందరికీ ఉండేలా కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానాన్ని అమలు చేయాలని కూడా కోరుకుంటున్నారు. ”అవినీతి నిర్మూలన కావాలన్నా, వరకట్నం లాంటి జాఢ్యాలు రూపుమాసి పోవాలన్నా చదువు ఉండాల్సిందే.. ఇంటికి దీపం ఇల్లాలు అన్నట్లుగా ప్రతి ఆడపిల్లా చదువుకుంటే ప్రతి కుటుంబం అభివృద్ధి చెందుతుంది, సామాజిక ప్రగతి రథం కదులుతుంది, అప్పుడు బంగారు తెలంగాణా సాధ్యమౌతుంది..” అన్నది ఆయన అభిప్రాయం. తెలంగాణలో విద్యార్థుల సంఖ్య 60 కంటే తక్కువగా ఉందన్న కారణంగా 4 వేలకుపైగా పాఠశాలలను మూసివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలపట్ల కూడా ఆయన ఆందోళన చెందుతున్నారు.. ” ఆ విధంగా చేయడం వల్ల ప్రభుత్వానికి కొంత నిధులు మిగిలిపోవచ్చునేమో గానీ దీనివల్ల తక్కువ జనాభా ఉండే లంబాడీ తండాలు, దళిత గూడేల్లోని పిల్లల బంగారు భవిష్యత్తు బుగ్గిపాలవుతుంది” అని ఆవేదన చెందుతున్నారు.

యువత భవిత..

చదువుకున్న యువతకు ఉపాధికల్పన అన్నది సవాల్‌ కాకూడదని, ఒక్క ఉద్యోగం కోసం వెయ్యి మంది పోటీపడే పరిస్థితి నుంచి ఉద్యోగుల కోసం పోటీలు పడే సంస్థలను సృష్టించాలన్నది రేవంత్‌ బృహత్తర ఆలోచన. దీని కోసం ఒక వైపు నూతన పారిశ్రామిక విధానాలతో పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ప్రతి జిల్లాలోనూ ఒక ఇండస్ట్రియల్‌ హబ్‌, ఐటి కారిడార్‌ ఏర్పాటయ్యేలా చూడటం, మరోవైపు పరిశ్రమలకు అవసరమైన కొత్త కోర్సులను ప్రవేశపెట్టి వాటిలో శిక్షణలు ఇవ్వడం ద్వారా ఆయా కోర్సులు చదివిన ప్రతి విద్యార్థి కళాశాల నుంచి నేరుగా ఉద్యోగానికి వెళ్లేలా చూడాలన్నది దీని ప్రధానమైన భాగం. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో ఉద్యోగావకాశాలను పెంచడంతోపాటుగా డియస్సీ, టిఎస్‌పిఎస్‌సి, ఇతర ప్రభుత్వ రంగాల్లోనూ నియామకాల ప్రక్రియ నిరంతరం కొనసాగించడం, సివిల్‌ సర్వీసు లాంటి ఉన్నత స్థానాలు కోరుకునేవారికి, వైద్యవిద్యను అభ్యసించాలనుకొనే వారికీ ప్రత్యేకంగా కోచింగ్‌ ఇప్చించడం లాంటి కార్యక్రమాలు అప్రతిహతంగా కొనసాగాలన్నది ఆయన అభిలాష. ” చదువుకున్న వారికి వారి చదువుకు తగిన అవకాశాలు రాకపోతే సమాజంలో అలజడి మొదలవుతుంది అది ఎన్నో అనర్థాలకు కూడా దారి తీస్తుంది.. అలా జరగకూడదంటే ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు పెంచాలి, తెలంగాణా గ్రామీణ ప్రాంతాల్లో అణగారిపోయిన కుటీర పరిశ్రమలకు పునరుజ్జీవం కలిగించే దిశగా చర్యలు చేపట్టాలి, ఏ ఉద్యోగ పోటీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే షెడ్యూల్‌ ఏడాది ముందుగానే ప్రకటించాలి..” అంటారు రేవంత్‌. అయితే యువత కేవలం ఉద్యోగాలను గురించి మాత్రమే ఆలోచించకుండా సమాజాన్ని మార్చడానికి అవకాశమున్న రాజకీయాల్లోకి కూడా రావాలన్నది ఆయన మరో అభిప్రాయం. ” యువతీ యువకులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సమాజహితానికి ఉపయోగపడే కొత్త ఆలోచనలు పుడతాయి.. కాలం చెల్లిన పథకాల స్థానంలో కొత్త పథకాలొస్తాయి, ప్రజలకు మేలు జరుగుతుంది.. దీనికి తాత తండ్రుల వారసత్వమేమీ అక్కర్లేదు, అనుకున్నది సాధించాలన్న తపన అందుకు శ్రమించే తత్వం ఉంటే చాలు, అలాంటి వారు ముందుకు వస్తే అవకాశం ఇవ్వడంలో నేను ముందుంటాను..” అని హామీ ఇస్తారు రేవంత్‌.

దళిత వర్గాల అభ్యున్నతి గురించి..

తెలంగాణ సమాజంలో అత్యధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు అవసరమన్నది రేవంత్‌ అభిప్రాయం. ముఖ్యంగా తెలంగాణలో 12 శాతం ఉన్న గిరిజన లంబాడీలను అభివృద్ధి చేయడంలో భాగంగా 500కు మించి జనాభా కలిగిన లంబాడీ తండాలన్నింటినీ తక్షణం ప్రత్యేక గ్రామపంచాయితీలుగా గుర్తించాలని అలాగే వాటిలో రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, కమ్యూనిటీ హాలు, స్కూలు, ఆస్పత్రి,రేషన్‌ షాపు తదితర మౌలిక వసతులన్నింటినీ ఏర్పాటు చేయాలన్నది ఆయన అభిమతం. మిగులు భూములన్నింటినీ దళిత గిరిజన కుటుంబాలకు పంచాలని, రేషన్‌ బియ్యం కోటాను వారికి ప్రత్యేకంగా నెలకు 50 కేజీలకు పెంచాలని అభిప్రాయపడ్తున్నారు. ఎస్టీలకు, ముస్లిం మైనార్టీ వర్గాల వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా భావిస్తున్నారు.

ఉద్యోగుల సంక్షేమం కూడా ముఖ్యమే.

” ప్రభుత్వం అన్నది పైకి కనిపించని ఆత్మ అయితే ప్రభుత్వ యంత్రాంగం అన్నది శరీరం లాంటిది.. ఆ స్థాయిలోనే మనం ప్రభుత్వ యంత్రాంగం అనబడే ఉద్యోగులను గౌరవించుకోవాలి.” ఇది రేవంత్‌ మనసులో మాట. ప్రభుత్వ ఉద్యోగులలో కొంత మంది అవినీతి పరులు ఉండొచ్చు కానీ ఎక్కువమంది నిజాయితీపరులే ఉన్నారు. అవినీతితో కోట్లు సంపాదించుకున్న వారు బాగానే ఉండొచ్చుగానీ నీతి నిజాయితీగా పని చేసి పదవీ విరమణ చేసిన వారు జీవిత చరమాంకంలో కనీసం సొంత ఇల్లు కూడా కట్టుకోలేక పోతున్నారు. అలాంటి వారందరినీ ఆదుకోవడానికి ప్రతి మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇచ్చి వారు కోరుకున్న విధంగా 2బిహెచ్‌కె, 3 బిహెచ్‌కె ఇళ్లను కట్టించాలి. అందుకయ్యే ఖర్చులో ప్రభుత్వ వాటాపోను మిగిలిన మొత్తాలను వారి వేతనాల నుంచి వాయిదాల రూపంలో తీసుకోవాలి, ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రతి ఉద్యోగికీ ఇలా ఇంటిని కేటాయించాలి. వారు సంతృప్తికరంగా పనిచేస్తే మరిన్ని సత్ఫలితాలు వస్తాయంటారు రేవంత్‌.